అటవీ ప్రాంతంలో అక్రమ సారా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు
*రామకుప్పం, అక్టోబర్ 10 (మేజర్ న్యూస్):* రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలోని యానాది కాలనీ, గుడ్డూరు అటవీ ప్రాంతాల్లో కుప్పం రూరల్ పోలీసులు శుక్రవారం విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, కుప్పం సబ్ డివిజన్ ఏఎస్పీ హేమంత్ బొడ్డు పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయి. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ నేతృత్వంలో రాళ్లబూదుగూరు ఎస్సై నరేష్, రామకుప్పం ఎస్సై మారెప్ప మరియు సిబ్బంది అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. తనిఖీల్లో సుమారు 5 వేల లీటర్ల బెల్లం ఊటను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అక్రమంగా నాటు సారా తయారీకి సిద్ధం చేసిన ఈ ఊటను పూర్తిగా పారబోసి స్థావరాలను ధ్వంసం చేశారు. అదే సమయంలో రౌడీషీటర్లను తనిఖీ చేసి వారి కదలికలు, ప్రస్తుత కార్యకలాపాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ అక్రమ మద్యం తయారీ, విక్రయం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
R.sreenivasuluరా
ముకుప్పo