అమలాపురం అయ్యప్ప స్వామి ఆలయంలో 72 రోజుల పాటు ఉచిత బిక్ష: 16న మహాకుంభాభిషేకం
సూర్య ఆధ్యాత్మిక డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని ఈదరపల్లి బైపాస్ రోడ్డులో కొలువైన ప్రసిద్ధ శ్రీ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ప్రతినిధుల ముఖ్య సమావేశం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. రాబోయే అయ్యప్ప మండల దీక్షా కాలాన్ని పురస్కరించుకుని భక్తులకు కల్పించాల్సిన వసతులు, ఆలయంలో చేపట్టాల్సిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై నిర్వాహకులు సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా విజయదశమి పర్వదినం నుంచి సుమారు 72 రోజుల పాటు నిరంతరాయంగా ఆలయ ప్రాంగణంలో దీక్షాపరులకు ఉచిత బిక్షా దాన మహోత్సవాన్ని నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
స్వామి భక్తులు, దాతలు, గురుస్వాముల ఆర్థిక సహకారంతో అయ్యప్ప భక్తులతో పాటు భవానీ మాలధారులకు సైతం రోజూ పవిత్రమైన ఉచిత బిక్షను అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. మండల కాలం పూర్తయ్యేంత వరకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి మాలధారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాద వితరణ సాగుతుందని తెలిపారు. దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ అన్నదాన సేవలో పాలుపంచుకోవాలని వారు పిలుపునిచ్చారు.
దీంతో పాటు ఆలయంలో ఈ నెల 16వ తేదీన అత్యంత వైభవంగా మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. అదే రోజున విశేష లక్ష పత్రి పూజ, ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక కాంతులు వెదజల్లేలా మహా దీపార్చన మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరపాలని నిర్ణయించారు. ఈ పవిత్ర పూజా క్రతువుల్లో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి, ఉత్సవ ఏర్పాట్లపై పలువురు ప్రముఖ గురుస్వాములు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు బండారు గంగాధర స్వామి, రామాయణం వెంకటేశ్వర స్వామి, కోన గురుస్వామి, మోరం దొరబాబు స్వామి, సంగినేడి గణేష్ స్వామి, దొమ్మేటి సాయి స్వామి, చాగంటి ప్రసాద్ స్వామి, నడుంపల్లి సత్యనారాయణ రాజు స్వామి మరియు ఆలయ శాశ్వత ట్రెజరర్ నల్లా చిట్టిబాబు తదితరులు పాల్గొని ఉత్సవాల వివరాలను అధికారికంగా వెల్లడించారు.