అక్వాన్ తుపాను హెచ్చరిక: యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, నవంబరు 18, మేజర్ న్యూస్:
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుపాను ప్రభావంతో ఈనెల 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, కోనసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయడంతో పాటు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఒడిశాలో వర్షాల వల్ల వరదలు వచ్చే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంత ప్రజలు, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమష్టి కృషితో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు.