ఆయా కుటుంబానికి ఉపాధ్యాయుల ఆపన్నహస్తం
నరసన్నపేట: పాము కాటుకు గురై మృతి చెందిన ప్రభుత్వ పాఠశాల ఆయా కుటుంబానికి నరసన్నపేట మండల ఉపాధ్యాయులు ఆపన్నహస్తం అందించారు. నరసన్నపేట మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాదం పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న చల్ల రాములమ్మ సెప్టెంబర్ 28న ఇంటి వద్ద నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యారు. చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌లో చేరగా, చికిత్స పొందుతూ అక్టోబర్ 3న మృతి చెందారు.
రాములమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం చదువుకుంటున్నారు. కుటుంబం తీవ్ర పేదరికంలో ఉండటంతో పాటు, ఇంటికి గోడలు, తలుపులు కూడా పూర్తిస్థాయిలో లేని పరిస్థితి నెలకొంది. ఆమె భర్త అనారోగ్యంతో గత ఏడాది కాలంగా మంచానికే పరిమితమై ఉండటంతో పాటు చూపు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో కుటుంబానికి రాములమ్మే ప్రధాన ఆధారంగా ఉన్నారు.
ఆమె మృతితో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిన విషయం తెలుసుకున్న నరసన్నపేట మండల ఉపాధ్యాయులు మానవతా దృక్పథంతో స్పందించారు. రూ.77,601 విరాళాలను సేకరించి కుటుంబానికి అందజేశారు. ఈ మొత్తాన్ని నరసన్నపేట మండల విద్యాశాఖాధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు చేతుల మీదుగా రాములమ్మ కుటుంబ సభ్యులకు అందించారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన నరసన్నపేట మండల ఉపాధ్యాయుల సేవా భావాన్ని పలువురు అభినందించారు.