ఆర్నాబ్' తుఫాన్ బీభత్సం
కోటబొమ్మాళిలో అతలాకుతలమైన జనజీవనం
కోటబొమ్మాళి, అక్టోబరు 27, మేజర్ న్యూస్:మండలంలో 'ఆర్నాబ్' తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి వేగవంతమైన ఈదురుగాలులు, ఎడతెరిపిలేని భారీ వర్షంతో పల్లెలు, పట్టణాలు అతలాకుతలమయ్యాయి. ఉదయం నుంచే కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షపు నీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కన్నీరుమున్నీరు అవుతున్న రైతులు: చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పండిన పంట దక్కే పరిస్థితి లేకపోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్ రావడంతో నోటికొచ్చే తిండి పోయినట్టు అయింది.
బుధవారం నాటికి ఈ తుఫాన్ మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న సమాచారంతో, రానున్న గంటల్లో ఇంకా ఎంత మేర ఆస్తి, పంట నష్టం జరుగుతుందోనని మండల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.