ఆపరేషన్ గరుడలో మెడికల్ షాపులపై తనిఖీలు
చీపురపల్లి మేజర్ న్యూస్ : డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ఆపరేషన్ గరుడ కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలోని మెడికల్ షాపులపై బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
డ్రగ్ ఇన్స్పెక్టర్ లావణ్య ఆధ్వర్యంలో చీపురుపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, విజయనగరం ఈగల్ టీం సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ షాపుల్లోని హెచ్ వన్, రికార్డులు పరిశీలించడంతో పాటు, ఎన్ ఆర్ ఎక్స్, మందుల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన బిల్లులు, రికార్డులను తనిఖీ చేశారు. మందుల చీటీ లేకుండా ఎన్ ఆర్ ఎక్స్ మందులను విక్రయించడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి మందులను దుర్వినియోగం చేయడం వల్ల కలిగే అనర్థాలపై మెడికల్ షాపుల నిర్వాహకులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మందుల విక్రయాలు చేపట్టాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ విక్రయాలు, వినియోగం లేదా అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఈ తనిఖీల్లో ఏ ఎస్ ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.