ఆధునిక సాగుతోనే అధిక లాభాలు
పామూరు, (పిసిపల్లి )మేజర్ న్యూస్ :
రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి నాణ్యమైన దిగుబడులు, అధిక లాభాలు సాధించాలని మండల ఉద్యాన శాఖాధికారి కె.కుసుమ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉద్యానశాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (జీహెచ్హెచ్) – రైతు సేవా కేంద్రాల వారోత్సవాలలో భాగంగా గురువారం పీసీ పల్లి గ్రామంలో రైతులకు ఉద్యాన పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ పథకాలపై పట్టు సాధించి అందుబాటులో ఉన్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యానరంగ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల ప్రాధాన్యతను కుసుమ వివరించారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక (ఐహెచ్డీపీ) పథకం ద్వారా కొత్తగా పండ్ల తోటల పెంపకం చేపట్టే రైతులకు లభించే ప్రోత్సాహకాలు దిగుబడి తగ్గిన పాత తోటల పునరుద్ధరణ పద్ధతులపై రైతులకు దిశానిర్దేశం చేశారు. అలాగే నీటి పొదుపునకు బిందు సేద్యం పంటలను కాపాడే నీడ వలలు (షేడ్నెట్లు), ఉత్పత్తుల నిల్వకు ప్యాక్హౌస్ల నిర్మాణం, మార్కెట్ నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉత్పత్తుల గ్రేడింగ్, సార్టింగ్ చేయడం లాభదాయక పూల సాగులో మెళకువల గురించి సమగ్రంగా వివరించారు.
ఉద్యాన పథకాల్లో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నామని అర్హులైన ప్రతి రైతునూ గుర్తించి గరిష్ఠ సంఖ్యలో దరఖాస్తులు సేకరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ప్రభుత్వ రాయితీలను పొందగోరే రైతులు తగిన ధ్రువీకరణ పత్రాలతో స్థానిక రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.