|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 06:29 PM
పటాన్చెరు : పరిపాల వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టిన నూతన డివిజన్ల ఏర్పాటులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్పూర్ పరిధిలో మరో రెండు నూతన డివిజన్లు ఏర్పాటు చేయాలని.. ప్రజల సౌకర్యార్థం పటాన్చెరు, రామచంద్రాపురం కేంద్రాలుగానే సర్కిల్ కార్యకలాపాలు కొనసాగించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి కమిషనర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్రతో పాటు నియోజకవర్గ కేంద్రంగా కలిగిన పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి పటాన్చెరు సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్ కి తరలించడం జరిగిందని.. పటాన్చెరు కేంద్రంగానే సర్కిల్ కార్యాలయాన్ని స్థానికంగానే కొనసాగించాలని.. లేనిపక్షంలో ప్రజలతోపాటు పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయని గతంలోనే కమిషనర్ కు విన్నవించడం జరిగిందని తెలిపారు. దీంతోపాటు అమీన్పూర్ కేంద్రంగా నూతనంగా ఏర్పాటు చేసిన సర్కిల్ కార్యాలయాన్ని రామచంద్రపురం కేంద్రంగా కొనసాగించాలని కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. పై రెండు అంశాల పైన కమిషనర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని.. అతి త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అతి త్వరలో వెలువడనున్నట్లు తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా అమీన్పూర్, బీరంగూడ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగిందని.. పాత అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలను కలిపి కిష్టారెడ్డిపేట తో ఒక డివిజన్.. తెల్లాపూర్ డివిజన్ పరిధిలో మరొక నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని ఆయన కమిషనర్ కు విన్నవించారు. నూతన డివిజన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు కమిషనర్ కర్ణన్ ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు.