|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 06:48 PM
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రాంతంలో సరికొత్త వినోద ప్రపంచం ఆవిష్కృతమైంది. చారిత్రాత్మకమైన ఓడియన్ థియేటర్ స్థానంలో నిర్మించిన 'ఓడియన్ మాల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వినోదం, టెక్నాలజీ కలయికతో దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత మల్టీప్లెక్స్‌గా దీనిని తీర్చిదిద్దారు.
ఈ మాల్ కేవలం సినిమా థియేటర్లకు మాత్రమే పరిమితం కాకుండా.. ఒక పరిపూర్ణమైన షాపింగ్ , వినోద కేంద్రంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో లులు మాల్ తరహాలోనే ఇక్కడ కూడా షాపింగ్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఇక్కడి మల్టీప్లెక్స్‌లో టికెటింగ్ నుండి ఫుడ్ కోర్ట్ సేవల వరకు కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా టికెట్ చెకింగ్, రోబోటిక్ సర్వీసెస్ వంటివి సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
సినిమా చూడటానికి మరింత అద్భుతంగా మార్చేందుకు 4కే లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ బ్రాండ్ల షోరూమ్‌లతో పాటు.. రుచికరమైన వంటకాల కోసం విశాలమైన ఫుడ్ కోర్ట్ ఇక్కడ అందుబాటులో ఉంది. పిల్లల కోసం ప్రత్యేకంగా గేమింగ్ జోన్‌ను కూడా రూపొందించారు. హైదరాబాద్‌లోని పాత థియేటర్ల స్థానంలో ఇలాంటి అత్యాధునిక మాల్స్ రావడం వల్ల నగర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వంటి రద్దీ ప్రాంతంలో వాహనాల నిలుపుదల కోసం ఇక్కడ మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యం కల్పించారు. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ఈ మాల్ ఏర్పాటు ద్వారా వందలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది.
షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, మెయింటెనెన్స్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. నగరానికి మధ్యలో ఉండే ఈ ప్రాంతం.. పర్యాటకులకు కూడా ప్రధాన ఆకర్షణగా మారుతుంది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని చూడాలనుకునే టెక్ ప్రియులకు ఇది ఒక మంచి వేదిక. గతంలో ఓడియన్ సినిమా హాల్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపును అలాగే ఉంచుతూ... నేటి కాలానికి తగినట్లుగా టెక్నాలజీని జోడించి ఈ మాల్‌ను నిర్మించడం విశేషం. నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చే ప్రభుత్వ ప్రయత్నంలో ఇదొక భాగమని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు.