|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 05:34 PM
మీడియా ముందుకు వెళ్లవద్దు. కూర్చుని మాట్లాడుకుందాం అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మంత్రికి నటరాజన్ సూచించారు.అసలు విషయంలోకివెళ్తే... కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారనే సమాచారంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడకి చేరుకున్నారు. అయితే, కొండా సురేఖ కుమార్తె సుష్మిత పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సుష్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై బురదజల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇవన్నీ చేయిస్తున్నారని ఆరోపించారు. తన తల్లిదండ్రులనే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖతో నటరాజన్ మాట్లాడినట్లు సమాచారం.