|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 05:12 PM
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని.. ఆ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు. దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబరు చివరి నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. శనివారం జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఐదుగురు మంత్రులతో ఒక ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక వివరాలను మరోసారి సరిచూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన శనివారం జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పేర్లు, వాటి సంఖ్యను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, ఆ వివరాలను వెంటనే రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.
కొన్ని జిల్లాల్లో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారడం, మరికొన్ని సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం కావడం వంటి మార్పుల కారణంగా స్థానాల సంఖ్యలో గందరగోళం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకసారి తుది జాబితా ఖరారైతే, దానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంటుంది. ఇందులో చిన్న పొరపాటు జరిగినా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందని, రాజకీయ విమర్శలకు తావిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రక్రియను కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.
ఈ నెల 29న జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి లోపాలు లేకుండా అన్ని వివరాలను సిద్ధం చేసి కేబినెట్ ముందు ఉంచేందుకు సిద్ధమయ్యారు. దీంతో త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.