|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 11:31 PM
మావోయిస్ట్ నేత తక్కలపెల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న భార్య నార్ల శ్రీవిద్యను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా హఫీజ్‌పేటలో ఉంటున్న ఆమె ఇంటికి ఆయుధాలు కలిగిన కొందరు వ్యక్తులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు. ఈ మేరకు కుటుంబసభ్యులు మానవ హక్కుల వేదికకు సమాచారం ఇచ్చారు. మఫ్టీలో వచ్చిన వారు పోలీసులా ? ఇతర వ్యక్తులా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.1992లో మావోయిస్టు పార్టీలో శ్రీవిద్య చేరారు. చైతన్య మహిళా సమాఖ్య, యూజీ క్యాడర్‌లో ఆమె పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అయితే పోలీసులే శ్రీవిద్యను అరెస్ట్ చేశారంటూ మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతయ్య, తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు జీవన్‌కుమార్ ఓ ప్రకటనలో ఆరోపించారు. శ్రీవిద్యను తీసుకెళ్లిన వారు పోలీసులైతే చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచాలని, లేదంటే ఆమెను వెతికి పట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని శ్రీవిద్యను కాపాడాలని పీస్ డైలాగ్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ కోరారు.నాగర్‌కర్నూలు జిల్లా తిరుమలాపురానికి చెందిన శ్రీవిద్య.. గతంలో అరెస్టయిన నార్ల రవిశర్మ సోదరి. ఆమె తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు. శ్రీవిద్య జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేశారు. ఆమెపై రూ.5లక్షల రివార్డు ఉంది. అయితే శ్రీవిద్య అరెస్ట్‌ను పోలీసులు ఇంతవరకూ ధ్రువీకరించలేదు