|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 09:01 PM
తెలంగాణలో ఈరోజు అందరూ బాగుపడుతుంటే ఇక మమ్మల్ని ఎవరు అడుగుతారని కేసీఆర్ దుఃఖపడుతున్నాడు. కానీ కేసీఆర్ శాపగ్రస్తుడు. నీ దుఃఖం పదేళ్ల వరకు అలాగే ఉంటుంది. ఆ దుఃఖం పెరిగి పెద్దదై.. భూతమై నిన్ను కబలిస్తుంది తప్ప నీకు విముక్తి లేదు కేసీఆర్, నీ కళ్ల ముందే తెలంగాణ అభిృవృద్ధి చెందుతుంది. ఆ బాధ్యత మేం తీసుకుంటాం" అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను అక్కున చేర్చుకొని ఎంపీగా గెలిపిస్తే, ఆయన ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు.వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పదేళ్ల హయాంలో పాలమూరు ప్రాంతానికి ఏమీ చేయకుండా, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే దుఃఖం వస్తోందని కేసీఆర్ అనడం విడ్డూరమని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు పచ్చగా మారుతుంటే కేసీఆర్‌కు దుఃఖం వస్తోందని చురక అంటించారు.పాలమూరు అంటే కేసీఆర్‌కు చిన్నచూపు అని, అయినప్పటికీ ఆయనకు మద్దతిస్తున్న ఈ జిల్లా నేతలు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలకు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు. జిల్లాకు చెందిన వివిధ ప్రాజెక్టులను పక్కన పెట్టారని ఆరోపించారు. కానీ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాత్రం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తు చేశారు. అది కూడా 2019లో కడితే 2023లో కూలిపోయిందని విమర్శించారు.1994 నుంచి పదేళ్లు తెలుగుదేశం అధికారంలో ఉందని, 2004 నుంచి పదేళ్లు కాంగ్రెస్, 2014 నుంచి 2023 డిసెంబరు వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. అయితే, 2034 వరకు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. దీనిని కేసీఆర్ తన గుండెల మీద రాసుకోవాలని పేర్కొన్నారు