![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 06:13 PM
హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. మరో రెండు గంటల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చాలా రోజులుగా వర్షాలు లేక అల్లాడిన హైదరాబాద్ ప్రజలకు.. ఈ భారీ వర్ష సూచన పెద్ద ఉపశమనం కలిగించనుంది.
ఇదిలా ఉండగా.. రేపు తెలంగాణలోని ఎనిమిది జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదనంగా.. 33 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
ఇప్పటికే వరకు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులు, సాగునీటి కొరత, భూగర్భ జలాల తగ్గుదల రైతులను తీవ్రంగా కలచివేశాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోవడం, పశువులకు మేత కొరత వంటి సమస్యలు తలెత్తాయి. అయితే, రాబోయే వర్షాలు ఈ సమస్యలకు తాత్కాలికంగానైనా పరిష్కారం చూపుతాయని ఆశిస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా త్వరలోనే వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇది రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు.. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు ఎంతో అవసరం. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఈ సారి తెలంగాణలో ముందుగానే ప్రవేశించాయి.. కానీ ఆ తర్వాత ఆశించినంత మేరకు వర్షాలు కురవలేదు. దీంతో రాష్ట్రంలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఈ అంచనాలకు తగ్గట్టుగా వర్షాలు కురిస్తే, చెరువులు, కుంటలు నిండి, భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి. ఇది వ్యవసాయ రంగానికి, ప్రజల తాగునీటి అవసరాలకు ఎంతో దోహదపడుతుంది.
ప్రభుత్వం కూడా వర్షాల కోసం ఎదురుచూస్తూనే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టింది. అయితే.. ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే వర్షాలు తప్పనిసరి. రాబోయే వర్షాలు తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను తగ్గించి, ప్రజలకు, రైతులకు ఆశను కల్పిస్తాయని ఆశిద్దాం. అయితే.. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో వరదలు, ట్రాఫిక్ సమస్యలు వంటివి తలెత్తే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని లేదంటే.. ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉండాలంటూ సూచనలు చేసింది.