![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 10:11 PM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో గంజాయి అక్రమ విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో 14 మందిని అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని ఓ బ్యాంకు సమీపంలో ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్‌ను చేపట్టి, గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని పట్టుకుంది. ఈ ఆపరేషన్‌లో నివ్వెరపోయే అంశం వెల్లడైంది. "భాయ్బచ్చా ఆగయా భాయ్" అనే వాట్సాప్ కోడ్‌ను ఉపయోగించి గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కోడ్ ద్వారా కొనుగోలుదారులతో సంప్రదింపులు జరిపిన డ్రగ్ పెడ్లర్ సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారంతో రెండు గంటల వ్యవధిలో 14 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నలుగురు ఐటీ ఉద్యోగులు, ఒక విద్యార్థి, ఒక ప్రాపర్టీ మేనేజర్, ఒక ట్రావెల్ ఏజెన్సీ ఓనర్‌తో పాటు మరో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఒక జంట 4 ఏళ్ల బాలుడితో సహా గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిపై ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహించగా, వారు గంజాయి వినియోగించినట్లు నిర్ధారణ అయింది. పోలీసుల విచారణలో 5 కిలోల గంజాయిని 50 గ్రాముల చొప్పున ప్యాకెట్లలో విక్రయిస్తున్నట్లు తేలింది. గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో గంజాయి వినియోగం పెరిగిపోతున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు మరిన్ని ఆపరేషన్‌లు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు