![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 07:00 PM
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల వీరంగాలు, ఘటాల ఊరేగింపుతో జాతర ప్రారంభమైంది. మహంకాళి అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళ హారతి ఇచ్చి జాతరను ప్రారంభించారు. లష్కర్ బోనాలు అని పిలవబడే ఉజ్జయిని బోనాల జాతర రెండు రోజుల పాటు జరగనుంది. జాతర సందర్భంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు.
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిన మహంకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి సీఎం రేవంత్ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు ఇచ్చారు. అమ్మవారికి మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించుకున్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.