|
|
by Suryaa Desk | Fri, Jun 13, 2025, 05:16 PM
కుటుంబ కలహాల వల్ల నాలుగేళ్ల కుమారుడి ముక్కు, నోరు మూసి దారుణంగా హత్య చేశాడో తండ్రి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన అక్షితకు ఐదేళ్ల క్రితం పోల్కంపేట్ గ్రామానికి చెందిన నర్వ అనిల్‌తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కుమారుడు శశాంక్ వయసు నాలుగు సంవత్సరాలు కాగా.. కుమార్తె వయసు ఏడు నెలలు.
రెండు రోజుల క్రితం అనిల్ దంపతులు బంధువుల గ్రామంలో బోనాల పండుగకు హాజరయ్యారు. అక్కడ అనిల్ కొడుకు శశాంక్ ఆడుకుంటుండగా.. ఓ పాప మెట్ల మీద నుంచి కింద పడింది. తను అనిల్ సోదరి కుమార్తె. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఈ విషయంపై గొడవ జరిగింది. ఆ తర్వాత అనిల్ దంపతులు వారి స్వగ్రామం పోల్కంపేట్‌కు తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక కూడా భార్యాభర్తల మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. ఆఖరికి అనిల్ తన భార్యపై చేయి చేసుకున్నాడు.
ఈక్రమంలో గురువారం అనిల్ భార్య ఆస్పత్రికి వెళ్లడం కోసం తనను పుట్టింటికి తీసుకెళ్లమని అతడిని అడిగింది. దీంతో కుటుంబం అంతా పోచారం గ్రామానికి వచ్చారు. ఆస్పత్రికి వెళ్లి వచ్చిన తర్వాత అక్షిత తన పుట్టింట్లోనే ఉండిపోయింది. అనిల్ తన కొడుకు శశాంక్‌ని తీసుకుని బైక్ మీద పోల్కంపేట్ బయలుదేరాడు.
పోచారం శివారు ప్రాంతానికి వచ్చాక బైక్ ఆపి శశంక్‌ను కిందికు దించాడు. ఈ గొడవంతటికీ శశాంకే కారణమని భావించిన అనిల్.. ఆ కోపంలో కన్నబిడ్డ ముక్కు, నోరు మూశాడు. తండ్రి చేసిన పనికి శశాంక్‌కి ఊపిరాడక ప్రాణాలు స్పృహ తప్పాడు. ఆతర్వాత కాసేపటికి శశంక్‌ని తీసుకుని ఇంటికి వెళ్లాడు. బాలుడిని గమనించిన కుటుంబ సభ్యులు వైద్యం కోసం వెంటనే నాగిరెడ్డిపేట్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే అప్పటికే చిన్నారి శశాంక్ మరణించాడని వైద్యులు తెలిపారు. అనిల్ భార్య, బంధువులు అతడిని నిలదీయగా... భార్యపై కోపంతో తానే శశంక్‌ని ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నారు.