|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 01:03 PM
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయ మహాప్రసాదాన్ని ఓ కుటుంబం డైనింగ్ టేబుల్‌పై కూర్చుని స్వీకరిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి, తీవ్ర వివాదానికి దారితీసింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడికి నివేదించే పవిత్ర ఆహారమైన మహాప్రసాదాన్ని సంప్రదాయబద్ధంగా నేలపై కూర్చుని ఆరగించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సంప్రదాయానికి విరుద్ధంగా జరిగిన ఈ ఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసింది.పూరీలోని ఓ బీచ్ రిసార్ట్‌లో సుమారు పది మంది సభ్యులున్న ఓ కుటుంబం, పిల్లలు సహా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉండగా ఓ పూజారి వారికి మహాప్రసాదాన్ని వడ్డిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. దీనిని గమనించిన ఓ వ్యక్తి వారిని ప్రశ్నించగా తాము అందరినీ అడిగిన తర్వాతే టేబుల్‌పై ప్రసాదం స్వీకరిస్తున్నామని ఓ మహిళ సమాధానమిచ్చింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇది సరికాదని పూజారిని నిలదీయడం కూడా వీడియోలో రికార్డయింది.ఈ వీడియో వైరల్ కావడంతో జగన్నాథ భక్తుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీనిపై శ్రీ జగన్నాథ ఆలయ యంత్రాంగం (ఎస్‌జేటీఏ) స్పందించింది. మహాప్రసాదాన్ని డైనింగ్ టేబుల్‌పై భుజించడం సంప్రదాయ విరుద్ధమని, ఇది భక్తులలో తీవ్ర ప్రతిస్పందనను రేకెత్తించిందని ఒక ప్రకటనలో పేర్కొంది.