త్రివిధ దళాల సమన్వయంలో సీడీఎస్ కీలక పాత్ర 2047 నాటికి ఆధునిక రక్షణ వ్యవస్థే లక్ష్యం: నితిన్ ఎ. గోఖలే
హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : భారత రక్షణ రంగంలోని త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంపొందించడం, ప్రభుత్వానికి సమగ్ర సైనిక సలహాలు అందించడం, దళాల పోరాట సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) కీలక పాత్ర పోషిస్తున్నారని భారత్ శక్తి గ్రూపు వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ నితిన్ ఎ. గోఖలే పేర్కొన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్‌పీపీ)లో శుక్రవారం ‘రేపటి యుద్ధాలకు సన్నద్ధం: త్రివిధ దళాల నుంచి ఏకీకృత పోరాట శక్తిగా’ అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం ఇచ్చారు.
భారత ఉన్నత రక్షణ వ్యవస్థ పరిణామక్రమం, కార్గిల్ సమీక్షా కమిటీ సిఫార్సులు, సీడీఎస్ వ్యవస్థ ఏర్పాటు, సైనిక వ్యవహారాల శాఖ (డీఎంఏ) పాత్రను గోఖలే వివరించారు. త్రివిధ దళాల ఏకీకరణ, సమీకృత థియేటర్ కమాండ్ల ఏర్పాటు, ఆధునీకరణ, స్వదేశీ రక్షణ ఉత్పత్తులు, మానవ వనరుల సంస్కరణల ఆవశ్యకతను వివరించారు. 2047 నాటికి సాయుధ దళాల కోసం దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించాలని, సంయుక్త సైనిక సిద్ధాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉన్నత రక్షణ వ్యవస్థలో సమన్వయం, సంస్థాగత సహకారం మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, విధాన రంగంలో అవకాశాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్‌పీపీ డీన్, ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పాల్గొన్నారు.