శభాష్ శారదమ్మ-అభివృద్ధి బాటలో కేశవాపురం పంచాయతీ
సూర్య,చర్ల,అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామపంచాయతీని ప్రగతి బాట పట్టించేందుకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తనదైన మార్క్ చూపిస్తూ కేశవాపురం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా నిలబెట్టేందుకు పాలకవర్గ సహకారంతో ప్రత్యేక కృషి చేస్తున్నారు సర్పంచ్ కాపుల శారద. పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే వీధిలైట్ల ఏర్పాటుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆమె పంచాయతీ పరిధిలోని ఆరు గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్యకు పరిష్కారం, రహదారుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను గుర్తించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం అభివృద్ధికై పాటుపడుతున్న ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టగానే గ్రామాల్లో నూతన వీధిలైట్లు ఏర్పాటు చేయించి పంచాయతీలో వెలుగులు నింపుతానని చెప్పకనే చెప్పారు. గ్రామాలలో విద్యుత్ స్తంభాలు లేని చోట సంబంధిత శాఖ అధికారులతో చర్చించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి వాటికి వీధిలైట్లు అమర్చటంతో పాటు ప్రతినిత్యం అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షిస్తున్నారు.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు
పంచాయతీ పరిధిలోని తాటి గుంపు, దండుపేట కాలనీ, గుంపెనగూడెం లోని కొన్ని కుటుంబాలకు గతంలో మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందేది కాదు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ శారద మండల స్థాయి అధికారులతో మాట్లాడి వారితో సమన్వయం చేసుకొని ఆయా ప్రాంతాల్లో మరమ్మత్తులు నిర్వహించి ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. తమకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఈ ప్రయత్నం సర్పంచ్ పై మరింత నమ్మకాన్ని పెంచింది.
డ్రైనేజీ నిర్మాణంతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం
గుంపెనగూడెం గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో ఆ గ్రామమంతా బురదమయంగా మారి ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాన రహదారికి ఇరువైపులా పచ్చ డ్రైనేజీలు నిర్మించారు. దీంతో వర్షపు రోడ్లపై నిలవకుండా ఉండి ప్రధాన సమస్య పరిష్కారమయింది. గుంతలు, గతుకులతో ఉన్న అంతర్గత రహదారులపై కంకర పోయించి రాకపోకలు సజావుగా సాగేలా రహదారులను తీర్చిదిద్దారు. పచ్చదనం పరిశుభ్రత కు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల్లో మొక్కలు నాటకం తో పాటు వాటి సంరక్షణ బాధ్యతను సిబ్బందికి అప్పగించి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. వర్షాకాలంలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లి క్లోరినేషన్ చేయడం ద్వారా సీజనల్ వ్యాధులను చాలా వరకు అరికట్టారు.
మండలంలోని తొలి కొమరం భీం విగ్రహం
ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ స్ఫూర్తిని చాటేలా కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో ని ఆరు గ్రామాలకు జంక్షన్ గా ఉన్న కేశవాపురం క్రాస్ రోడ్డు వద్ద గ్రామస్తుల సహకారంతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. మండలంలోని తొలి కొమరం భీమ్ విగ్రహంగా గుర్తింపు లభించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
ఎమ్మెల్యే చొరవతో నిలిచిపోయిన బీటీ రోడ్ల పనులకు కదలిక
రైస్ పేట నుండి తాటి గుంపు మీదుగా దండుపేట కాలనీ వరకు, కేశవాపురం క్రాస్ రోడ్డు నుండి దండుపేట కాలనీ వరకు డీటీ రోడ్ల నిర్మాణానికి గతంలోనే అనుమతులు లభించి నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని సర్పంచ్ కాపుల శారద, ఉప సర్పంచ్ కూనారపు సతీష్ లు పలుమార్లు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన చొరవతో రైస్ పేట నుండి దండుపేట కాలనీ వరకు రహదారి నిర్మాణం పూర్తికాగా కేశవాపురం క్రాస్ రోడ్ నుండి దండుపేట కాలనీ వరకు పనులు కొనసాగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఆ రోడ్డు కూడా పూర్తవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దటమే లక్ష్యం
కేశవాపురం పంచాయతీ పరిధిలోని ఆరు గ్రామాలను అభివృద్ధి చేసి మండలంలోని ఆదర్శ పంచాయతీగా నిలబెట్టాలని లక్ష్యంతో సర్పంచ్ కాపుల శారద పాలకవర్గ సహకారంతో అభివృద్ధికి అడుగులు వేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విభీజీ రాంజీ పథకం కింద జాబ్ కార్డులు అందించేందుకు సర్పంచ్ ప్రత్యేక కృషి చేస్తున్నారు. గ్రామపంచాయతీకి సుమారు మూడు కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఈ దిశగా ఇప్పటికే కొంత పురోగతి సాధించారు.
భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు
ఎల్ నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటి వద్ద నిర్మాణం చేపట్టాలని శారద ప్రతిపాదించారు అంశాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకువెళ్లి ఆమోదం కూడా పొందారు. ఇప్పుడు గుంటల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి భవిష్యత్తులో నీటి కొరత తగ్గించాలనేదే తన లక్ష్యమని ఆమె అంటున్నారు.
బతుకమ్మ వేడుకలకు ఆర్థిక సహాయం
తెలంగాణ సంస్కృతి ప్రతీకైన బతుకమ్మ పండుగను తన పంచాయతీ పరిధిలోని మహిళలు సంతోషంగా జరుపుకునేందుకు గ్రామాల్లోని బతుకమ్మ గద్దల వద్ద ముందస్తుగా ఏర్పాటు చేశారు. మహిళల ఆటపాటలకు ఇబ్బందులు కలగకుండా గద్దెల వద్ద కంకర పోయించడంతోపాటు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రతి గద్దెకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సర్పంచ్ శారద పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు పాలకవర్గాన్ని ఇటు అధికారులను సమన్వయం చేసుకుంటూ తన పరిధిలోని ఆరు గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పాటుపడుతున్న ఆమె ప్రయాణానికి ప్రజల నుండి వినిపిస్తున్న అభినందన ఒక్కటే......అదే "శభాష్ శారదమ్మ". అభివృద్ధి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మిగతా పంచాయతీలకు రోల్ మోడల్ గా నిలుస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు.
సూర్య రిపోర్టర్ రవి కిరణ్ చర్ల