రూ.100 కోట్లతో శంకర్‌పల్లి–వికారాబాద్ రహదారి విస్తరణ పనులు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: శంకర్‌పల్లి–వికారాబాద్ ప్రధాన రహదారి విస్తరణ, నిర్మాణ పనులను రూ.100 కోట్ల నిధులతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ , వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రహదారి నిర్మాణ పనుల కోసం రూ.100 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేసి, త్వరలోనే పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు.వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం వట్టిమీనపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అదితి గోక్షేత్రం ప్రారంభోత్సవం, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాల దివ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి విస్తరణ పనులపై వివరాలు వెల్లడించారు. అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్పీకర్‌కు ఆశీస్సులు అందజేశారు.