telangana
రవాణాలో 15 కిలోల బియ్యం మాయం..? నవత ట్రాన్స్‌పోర్ట్‌పై బాధితుడి ఆరోపణ
సూర్య, మందమర్రి : రవాణా కోసం అప్పగించిన వస్తువులు గమ్యస్థానానికి చేరుకునే సరికి తక్కువ పరిమాణంలో ఉండటంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మందమర్రి నుంచి హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు 50 కిలోల బియ్యం బస్తాను పంపిస్తే, బంధువులకు చేరే సమయానికి అది 35 కిలోలకు తగ్గిపోయిందని వెంకటేష్ ఆరోపించాడు. రవాణా సమయంలో బియ్యం బస్తా చిరిగిపోయి ఉండటంతోపాటు, దానికి మళ్లీ కుట్లు వేసి పంపించారని పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే.. వెంకటేష్ ఈ నెల 12వ తేదీన మందమర్రిలోని నవత ట్రాన్స్‌పోర్ట్ ద్వారా హైదరాబాద్‌లోని తన బంధువులకు 50 కిలోల బియ్యం బస్తాను పంపించాడు. ఇందుకోసం రూ.275 రవాణా చార్జీలు చెల్లించి రసీదు కూడా పొందాడు. అయితే హైదరాబాద్‌లోని బంధువులకు బియ్యం బస్తా చేరుకునే సమయానికి అది చిరిగిపోయి, తిరిగి కుట్లు వేసిన స్థితిలో కనిపించిందని తెలిపాడు. బియ్యం బస్తాను తూకం వేయగా 50 కిలోలకు బదులుగా 35 కిలోలు మాత్రమే ఉన్నాయని, సుమారు 15 కిలోల బియ్యం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో, బియ్యం విలువను పరిగణనలోకి తీసుకుని తనకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని వెంకటేష్ ప్రశ్నించాడు. రవాణా కోసం చార్జీలు చెల్లించి, రసీదు పొందినప్పటికీ వస్తువులు సక్రమంగా గమ్యస్థానానికి చేరకపోవడం బాధాకరమని పేర్కొన్నాడు. ఈ ఘటనపై నవత ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యం స్పందించి, బియ్యం తగ్గిపోవడానికి గల కారణాలను వెల్లడించడంతోపాటు, తనకు జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత వహించి పరిహారం చెల్లించాలని వెంకటేష్ డిమాండ్ చేశాడు.