రామన్నగూడెంలో అటవీ సిబ్బందిపై గ్రామస్తుల ఆందోళన-నాలుగు ఎకరాల కంది పంట ధ్వంసం చేశారని ఆరోపణ
సూర్య అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో కంది పంట ధ్వంసం ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ సర్పంచ్ మడకం నాగేశ్వరరావుకు చెందిన పట్టా పొలంలో సాగు చేసిన నాలుగు ఎకరాల కంది పంటను అటవీశాఖ సిబ్బంది ధ్వంసం చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
రామన్నగూడెం టేక్ ప్లాంటేషన్ సమీపంలోని అటవీశాఖ బేస్ క్యాంపు వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. సాగు చేసిన పంట ధ్వంసం కావడంతో రైతుకు నష్టం వాటిల్లిందని, ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
రైతుకు జరిగిన నష్టంపై అధికారులు విచారణ జరిపి, భూమి హక్కులు, పంట సాగుకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట