రామకృష్ణాపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. • వేడుకల్లో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
సూర్య, రామకృష్ణాపూర్ : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగను రామకృష్ణాపూర్ లోని ఠాగూర్ స్టేడియం,సిహెచ్ పి లో అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కార్మిక శాఖ మాత్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం సరోజ వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, సేవా సమితి అధ్యక్షురాలు ఎన్. శ్రీవాణి రాధాకృష్ణ, ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి సౌందర్యానికి బతుకమ్మ పండుగ ప్రతీక. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గౌరమ్మను సద్దుల బతుకమ్మ రోజున సింగరేణి కుటుంబాల సమక్షంలో, ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఒకచోటకు చేరి సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషకరం. సింగరేణి ప్రాంతంలో సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రజలంతా ఐక్యంగా పండుగలు జరుపుకోవడం అభినందనీయం అని అన్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రకాల పూలతో అత్యంత సుందరంగా, కళాత్మకంగా బతుకమ్మలను పేర్చిన మహిళలను ఉత్సాహపరుస్తూ ప్రత్యేక పోటీలు నిర్వహించారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులతో పాటు, మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు, యూనియన్ నాయకులు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.