రామగిరి ఖిల్లాలో 10 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసిన ఎంపీ వంశీకృష్ణ
సూర్య, సెంటినరీ కాలనీ :చారిత్రక రామగిరి ఖిల్లాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం రామగిరి ఖిల్లా ప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన ట్రెక్కింగ్ చేసిన ఆయన, ఖిల్లాలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, ప్రకృతి అందాలను స్వయంగా పరిశీలించారు. ఏడు గేట్లు దాటి, రెండు సరస్సులను అధిగమించి, నాలుగు గుట్టలను అధిరోహిస్తూ ఖిల్లా పైభాగానికి చేరుకున్న ఎంపీ వంశీకృష్ణ, అక్కడి శివాలయం, శ్రీ రామచంద్ర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్రం మంజూరు చేసిన రూ.12 కోట్లలో రూ.7.5 కోట్లు రామగిరి ఖిల్లా పర్యాటక అభివృద్ధికి కేటాయించిందని, 2.1 కిలోమీటర్ల రోప్‌వే నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా రామగిరి ఖిల్లా వద్ద పర్యాటకులకు మౌలిక వసతులు కల్పించేందుకు రూ.2.5 కోట్ల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. రామగిరి ఖిల్లా పర్యాటక అభివృద్ధికి కీలకమైన రోప్‌వే ఏర్పాటుకు కేంద్ర స్థాయిలో కృషి చేసి నిధుల మంజూరుకు చొరవ తీసుకున్న ఎంపీ వంశీ ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రోప్‌వే అందుబాటులోకి వస్తే వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా పర్యాటకులు ఖిల్లాను సులభంగా సందర్శించే అవకాశం కలుగుతుంది. తద్వారా మంథని ప్రాంతానికి పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించడం తో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఖిల్లాలో సుమారు 10 కిలోమీటర్ల మేర సాహసోపేతంగా ట్రెక్కింగ్ చేసిన వంశీకృష్ణ యువతకు సవాల్ విసిరారు. యువతలో సాహస క్రీడలు, ఫిట్‌నెస్ పట్ల ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ట్రెక్కింగ్ సవాల్‌లో విజేతగా నిలిచిన వారికి వన్‌ప్లస్ ఫోన్‌ను బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సవాల్ యువతలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు రామగిరి ఖిల్లా పై మరింత ఆసక్తిని పెంచే అవకాశం ఉంది. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే రామగిరి ఖిల్లా లోని పురాతన ఆలయాలు, కోట నిర్మాణాలు, ప్రకృతి అందాలను విస్తృతంగా ప్రచారం చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు చేపడుతున్న ప్రయత్నాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రామగిరి ఖిల్లాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం, మంథని ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి కొత్త బాటలు వేయడం లక్ష్యంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేస్తున్న కృషి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.