ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన
పటాన్‌చెరు;రాష్ట్రంలో కీలక పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన పటాన్‌చెరు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి విమర్శించారు. శనివారం పటాన్‌చెరు పరిధిలో అధికారులతో కలిసి సుమారు నాలుగు గంటల పాటు మార్నింగ్ వాక్ నిర్వహించి, వివిధ కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రత్యక్షంగా పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.దోషం చెరువు ఆక్రమణలకు గురికాకుండా 16 ఎకరాల స్థలాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.2022లో చెరువు అభివృద్ధికి రూ.1.15 కోట్లు మంజూరైనా డ్రైనేజీ పైప్‌లైన్, వాకింగ్ ట్రాక్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు.శాంతినగర్‌లోని స్మశానవాటిక స్థలానికి సర్వే నిర్వహించి హద్దులు గుర్తించాలని తహసీల్దార్‌ను కోరారు.బండ్లగూడ గోపాల్‌రెడ్డి కాలనీలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని, అర్హులైన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. నేతాజీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది కొరత, ప్రభుత్వ పాఠశాలలు, కాలనీల్లో కనీస వసతుల లేమిపై స్థానికులు ఫిర్యాదు చేశారు.ప్రజల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అంజిరెడ్డి సూచించారు. పర్యటనలో గుర్తించిన సమస్యలన్నింటినీ వారంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పటాన్‌చెరు సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి,జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు శ్రీనివాస్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.