పండుగ వేళ జోరుగా బెల్ట్ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ?
హుస్నాబాద్ :పండుగ వచ్చిందంటే చాలు.. పట్టణాలు, గ్రామాల్లో మద్యం విక్రయాలు జోరందుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అనధికార బెల్ట్ షాపుల నిర్వహణ, కల్తీ మద్యం విక్రయాలపై అనుమానాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ నిఘా ఏ మేరకు ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పండుగ వేళ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
బెల్ట్ షాపులపై నియంత్రణ ఏదీ..?:
ప్రభుత్వ అనుమతి పొందిన మద్యం దుకాణాలకే పరిమితం కావాల్సిన విక్రయాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, సెలవు దినాల్లో మద్యం విక్రయాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలి. అయితే హుస్నాబాద్ ప్రాంతంలో బెల్ట్ షాపుల నిర్వహణపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
కల్తీ మద్యం విక్రయిస్తే ప్రజల ఆరోగ్యానికి ముప్పు!మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం ఒక అంశమైతే, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అంతకంటే ముఖ్యమైన బాధ్యత. కల్తీ మద్యం విక్రయాలు జరిగితే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల మద్యం నాణ్యతపై అనుమానాలు వచ్చినప్పుడు అధికారులు వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించాలి. అక్రమ విక్రయాలను అరికట్టడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ ఆదాయమే లక్ష్యమా.. ప్రజల ఆరోగ్యం పట్టదా?:ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే మద్యం విక్రయాల వ్యవస్థలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఉండాలి. ఆదాయం వస్తుందనే కారణంతో అక్రమ విక్రయాలపై చూసీచూడనట్లు వ్యవహరిస్తే నష్టపోయేది సామాన్య ప్రజలే. పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన ప్రజలు కల్తీ మద్యం తాగి అనారోగ్యాన్ని కొనితెచ్చుకునే పరిస్థితులు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉంది.