మెట్లకుంటలో ఘనంగా దుర్గామాత సామూహిక కుంకుమార్చన
బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 19): మండల పరిధిలోని మెట్లకుంట గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గ్రామంలోని గణేష్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో సోమవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద మంత్రోచ్ఛారణలు, అమ్మవారి నామస్మరణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలో పాల్గొని తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు. లోకకల్యాణం, గ్రామ ప్రజల సంక్షేమం, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, భక్తుల జైజైధ్వానాలతో దుర్గామాత మండపం మార్మోగింది. సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు, భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమాదేవి నరసింహులు, చౌదర్పల్లి గోపాల్, అనంతమ్మ, కుర్వ శ్రీశైలం లక్ష్మి, పిడుగు బాలరాజ్, మేడిపల్లి మొగులాలి, ఆంజిలయ్య, అశోక్, సత్తి, ఆనంద్ తదితరులు దంపతులతో కలిసి, గ్రామస్తులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.