పేద విద్యార్థుల పై దయలేదా..? ఆర్.కృష్ణయ్య
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజుల బకాయిలు పేరుకుపోవడంతో డిగ్రీలు, ఇంజినీరింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన లక్షలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.8,500 కోట్ల ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించి, తమ సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వేలాది మంది విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. బీఎన్ రెడ్డి చౌరస్తా నుంచి హస్తినాపురం వరకు సాగిన ఈ ప్రదర్శనకు రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఫీజుల బకాయిలకు బడ్జెట్ కేటాయిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు నిధులు విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి విద్యార్థుల భవిష్యత్తు కంటే ఢిల్లీ పర్యటనలు, పార్టీ హైకమాండ్‌కు రక్షణ కల్పించడమే ముఖ్యమైందా? విద్యార్థుల ఆర్తనాదాలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి లక్షలాది మంది పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తున్నారని, పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలు వచ్చిన వారు కూడా అవకాశాలు కోల్పోతున్నారని, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని చెప్పారు. విదేశాల్లో ఉన్నత విద్యకు సీట్లు సాధించిన విద్యార్థులు సైతం సర్టిఫికెట్లు లేక వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. అప్పులు చేసి ఫీజులు చెల్లించిన కొందరే సర్టిఫికెట్లు పొందగలుగుతున్నారని, ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఫీజుల బకాయిలు విడుదల చేస్తే కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందిస్తాయని, ఫీజులు చెల్లించిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకున్న వారు కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమేనని, మిగిలిన 60 నుంచి 70 శాతం మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ఇంకా కళాశాలల్లోనే ఉన్నాయని కృష్ణయ్య తెలిపారు. ఫీజులు మంజూరైన వివరాలను ప్రతి విద్యార్థికి నేరుగా మొబైల్ సందేశం ద్వారా తెలియజేయాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు, విద్యార్థులకు కూడా ఫీజుల మంజూరు వివరాలు పారదర్శకంగా తెలియజేయాలని కోరారు. ప్రైవేటు కళాశాలలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, మహిళా విశ్వవిద్యాలయం, ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఫీజులు చెల్లించే వరకు అడ్మిషన్లు ఇవ్వకపోవడం, సర్టిఫికెట్లు నిలిపివేయడం అన్యాయమన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను ఫీజుల కోసం నిలిపివేయరాదని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు, ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కొన్ని కళాశాలలు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 34 నెలలు గడిచినా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా భారీ ఆదాయం వస్తున్నప్పటికీ 14 లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిధులు కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తున్న ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం నిధులు విడుదల చేయలేదా? అని నిలదీశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలు సమాజంలో విద్యాపరమైన విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయని, ఈ పథకాలను కొనసాగించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ భారీ ప్రదర్శనలో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేందర్, అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు శివకుమార్ యాదవ్, నిఖిల్ పటేల్, ప్రీతం, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.