పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి!
గండిపేట్ మేజర్ న్యూస్: నవంబర్ 12 అత్తాపూర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారి కార్యాలయంలో కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో కింది స్థాయి సిబ్బందికి సైతం స్పష్టత లేదని సమాచారం. భవన నిర్మాణ అనుమతులు, ఇతర పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు అధికారి కోసం పడిగాపులు కాస్తూ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు.
మరోవైపు డైరీ ఫామ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడి నుంచే పట్టణ ప్రణాళిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు అక్కడి నుంచే భవన నిర్మాణ అనుమతుల ఆమోద ప్రక్రియ చేపడుతున్నారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించాల్సిన విధులు ప్రైవేటు భవనంలో నిర్వహించాల్సిన అవసరం ఏమిటి? దీనికి ఉన్నతాధికారుల అనుమతి ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారి అందుబాటులో లేకపోవడంపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలి. శ్రీధర్ విధుల నిర్వహణ, కార్యాలయ హాజరు, ప్రైవేటు భవనంలో కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారి కార్యాలయంలో ఉంటారా? లేక ప్రజలే అధికారి కోసం కార్యాలయం చుట్టూ తిరగాలా? అన్న ప్రశ్నకు ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.