పాలపిట్టను కాపాడండి.. జంతు హింస లేని దసరా జరుపుకోండి
సిద్దిపేట, : తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను కాపాడాలని సిద్దిపేట జిల్లా అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దసరా పండుగ సందర్భంగా పాలపిట్టలను పట్టుకోవడం, విక్రయించడం, హింసించడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించింది.ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి ఎ. పద్మజారాణి, ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ.. పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి అని, దాని సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పండుగ సంప్రదాయాల పేరుతో పక్షులను పట్టుకోవడం, వాటిని ఇబ్బందులకు గురిచేయడం వన్యప్రాణుల సంరక్షణకు విరుద్ధమని తెలిపారు.వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 ప్రకారం పాలపిట్టలను పట్టుకోవడం, విక్రయించడం లేదా హింసించడం నేరమని అటవీ శాఖ వెల్లడించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఎవరైనా పాలపిట్టలను పట్టుకున్నా, విక్రయించినా లేదా ప్రదర్శించినా వెంటనే అటవీ శాఖ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు 18004255364, 9803338666కు సమాచారం అందించాలని కోరింది.ప్రజలందరూ పాలపిట్టలను సంరక్షిస్తూ, పక్షుల పట్ల కరుణ చూపాలని, ప్రకృతి పరిరక్షణకు సహకరిస్తూ జంతు హింస లేని దసరా పండుగను జరుపుకోవాలని జిల్లా అటవీ అధికారి ఎ. పద్మజారాణి విజ్ఞప్తి చేశారు.