ప్రశాంత ఎన్నికలకు సహకరించండి * రాజకీయ పక్షాలను కోరిన ఎన్నికల అధికారి *
భోగాపురం, సూర్య : త్వరలో జరగనున్న ఎంపీటీసీ,జేపీటీసీ ఎన్నికలు ప్రశాంతం వాతావరణంలో జరిపేందుకు రాకీయనాయకులు,మండల ప్రజలు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.రామారావు కోరారు.మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రాజకీయ పార్టీల పక్షాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన అన్నారు. ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వివరాలను ఆయన వెల్లడించారు. నామినేషన్లను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో, జెడ్పీటీసీ స్థానానికి విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, తిరస్కరణకు గురైన నామినేషన్లపై అక్టోబర్ 26న అప్పీళ్ల పరిష్కారం ఉంటుందని వివరించారు. అక్టోబర్ 27న మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. పోటీ ఉన్న చోట నవంబర్ 3న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 5న భోగాపురం ఏపీ మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేయనున్న కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
* 46,922 మంది ఓటర్లు
భోగాపురం మండలంలో మొత్తం 46,922 మంది ఓటర్లు ఉన్నారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. వీరిలో 23,082 మంది పురుషులు, 23,839 మంది మహిళలు ఉన్నారని వివరించారు. మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలు, 55 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.
* ధరావత్తు వివరాలు
ఎంపీటీసీ స్థానానికి అన్‌రిజర్వుడ్ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500 ధరావత్తు చెల్లించాలి. జెడ్పీటీసీ స్థానానికి అన్‌రిజర్వుడ్ అభ్యర్థులు రూ.6,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.3,000 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. భోగాపురం మండలంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.