నృసింహ క్షేత్రం నుంచి ధర్మ జాగృతి శంఖారావం!
సూర్య జూలపల్లి ;;గోవింద నామస్మరణతో మార్మోగిన నృసింహ క్షేత్రం.. భక్తి పారవశ్యంలో పరవశించిన భక్తజనం.. సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా సాగిన ఆధ్యాత్మిక సంకల్పం.. పెద్దాపూర్ శ్రీ యోగానంద లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం భక్తిభావంతో పులకించింది. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన ఎనిమిదో గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్ర పరిసరాలు కిటకిటలాడాయి. ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఈ కార్యక్రమం భక్తులకు కనువిందు చేయగా, సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఐక్యతపై సాగిన ధర్మోపదేశం వారిలో నూతన స్ఫూర్తిని నింపింది.
ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలి
కొండగట్టు గిరి ప్రదక్షిణ సంకల్పకర్త శ్రీశ్రీశ్రీ సురేష్ ఆత్మారామ్ మహారాజ్ గురూజీ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తజనాన్ని ఉద్దేశించి ధర్మ సందేశం అందించిన గురూజీ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. భక్తులతో కలిసి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని, భావితరాల భవిష్యత్తుకు ధార్మిక విలువలే బలమైన పునాదులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. వేలాది మంది భక్తులు ఒకే ఆధ్యాత్మిక సంకల్పంతో గిరి ప్రదక్షిణలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు హిందువుల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడంతోపాటు సనాతన ధర్మంపై నిబద్ధతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
ఆపదలో ఉన్న తోటి హిందువులకు అండగా నిలవాలని, పరస్పర సహకారం, ఐక్యతతో ధార్మిక సమాజాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి హిందూ కుటుంబం చిన్నతనం నుంచే పిల్లలకు దేవాలయాల సందర్శనను అలవాటు చేయడంతోపాటు సనాతన ధర్మం, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయాలని కోరారు. ధర్మాన్ని పరిరక్షించడమే కాకుండా దాని విలువలను భావితరాలకు వారసత్వంగా అందించే బాధ్యతను ప్రతి ఒక్కరూ స్వీకరించాలని పిలుపునిచ్చారు.
నృసింహ క్షేత్రం నుంచి కొండగట్టుకు బైక్ ర్యాలీ
గిరి ప్రదక్షిణ అనంతరం పెద్దాపూర్ శ్రీ యోగానంద లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరే బైక్ ర్యాలీని గురూజీ ప్రారంభించారు. జూలపల్లి మండలానికి చెందిన భక్తులు బైక్‌లపై ర్యాలీగా కొండగట్టుకు పయనమయ్యారు. అక్కడ నిర్వహించే గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహంగా బయలుదేరారు. పెద్దాపూర్ నృసింహ క్షేత్రం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం వరకు సాగిన ఈ ఆధ్యాత్మిక యాత్ర ధార్మిక చైతన్యానికి ప్రతీకగా నిలిచింది.
పేరు వెల్లడించకుండా రూ.10,116 విరాళం
గిరి ప్రదక్షిణ భవిష్యత్తు కార్యక్రమాల నిర్వహణకు పెద్దాపూర్ గ్రామానికి చెందిన, ప్రస్తుతం కరీంనగర్‌లో నివసిస్తున్న ఓ భక్తుడు గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు, ఇతర అవసరాల నిమిత్తం తన పేరు వెల్లడించకుండా రూ.10,116 విరాళంగా అందజేశారు. ప్రచారానికి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ సర్పంచ్ తొగరు శ్రీనివాస్, సర్పంచులు దండె వెంకటేశ్వర్లు, నాంపల్లి సంపత్ కుమార్, మెండె తిరుపతి, ఉప సర్పంచ్ కొప్పుల మహేష్, బీజేపీ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, అమరగాని ప్రదీప్ కుమార్, బీఆర్‌ఎస్ నాయకురాలు కటారి రేవతి రావు, కంకణాల శ్రీనివాస్, ఒమేగా హాస్పిటల్ డైరెక్టర్ అరుకోల శ్రీనివాస్, భజన బృందాల సభ్యులు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.