నూతన జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీఏ సేవలు ప్రారంభం, -ప్రజలు, వాహనదారులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా రవాణా అధికారి ఇమ్రాన్ అహ్మద్
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద కలెక్టరేట్ సమీపంలో నూతనంగా నిర్మించి ఇటీవలే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ప్రారంభించిన నూతన జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీఏ సేవలు శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు జిల్లా రవాణా అధికారి ఇమ్రాన్ అహ్మద్ తెలిపారు. నూతన కార్యాలయం నుంచి రవాణా శాఖకు సంబంధించిన సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన శనివారం తెలిపారు.
జిల్లా ప్రజలకు రవాణా శాఖ సేవలను మరింత చేరువ చేయడంతోపాటు, వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నూతన కార్యాలయాన్ని శుక్రవారం నుండి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతమైన కొల్లాపూర్ చౌరస్తా వద్ద, కలెక్టరేట్ సమీపంలో కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల నాగర్ కర్నూలు జిల్లా నలుమూలల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కార్యాలయాన్ని చేరుకోవడం సులభతరమవుతుందని ఆయన తెలిపారు.
రవాణా శాఖకు సంబంధించిన పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన సేవలను సులభంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన రవాణా శాఖ పనులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు తదితర సేవల కోసం నూతన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. సంబంధిత సేవలను పొందేందుకు అవసరమైన పత్రాలతో కార్యాలయానికి రావాలని సూచించారు.
నూతన కార్యాలయంలో ఆర్టీఏ సేవలు ప్రారంభం కావడంతో జిల్లా ప్రజలకు రవాణా శాఖ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రజలు, వాహనదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని తమ రవాణా శాఖ సంబంధిత పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి ఇమ్రాన్ అహ్మద్ కోరారు.
పి. వినయ్ కుమార్ , నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్