25న విజయ భేతాళ స్వామి వాహన మహోత్సవం :అధికారుల కీలక సమీక్ష, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
సూర్య లోకల్ డెస్క్, అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో దేవీ శరన్నవరాత్రుల విజయదశమి అనంతరం ఈ నెల 25న అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ విజయ భేతాళ స్వామి వారి వాహన మహోత్సవాన్ని స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలకు లోబడి, పూర్తి ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక పెద్దవీధిలోని మినీ కళ్యాణ మండపంలో పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు అధ్యక్షతన 15 పాలాల ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
కోటప్పకొండ తర్వాత అంతటి ఘనత – శాంతిభద్రతలే ముఖ్యం:
ఈ సమావేశంలో ఆర్డీవో జి.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రసిద్ధ కోటప్పకొండ తిరునాళ్ల తర్వాత ఆ స్థాయిలో అత్యంత వైభవంగా జరిగే రెండో అతిపెద్ద ఉత్సవంగా అంబాజీపేట భేతాళస్వామి వాహన మహోత్సవానికి విశేష గుర్తింపు ఉందని కొనియాడారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, ఎలాంటి ఘర్షణలు లేదా ఆవేశాలకు తావులేకుండా శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, నిర్వాహకులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
ఎన్నికల కోడ్ అమలు – డ్రోన్లతో కట్టుదిట్టమైన నిఘా:
డీఎస్పీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రత్యేక సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు:
డ్రోన్ నిఘా & బందోబస్తు: వాహన మహోత్సవం, తీర్థం, ఆర్కెస్ట్రా వేదికల వద్ద శాంతిభద్రతల పర్యవేక్షణకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని, తగినంత పోలీసు బలగాలను మొహరిస్తున్నామని తెలిపారు.
డీజేలు, బాణాసంచాపై ఆంక్షలు: డీజే శబ్దాలను నిర్దేశిత పరిమితికి మించకుండా తగ్గించాలని, బాణాసంచా వినియోగాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలని ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణ: వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ ఆర్.భీమరాజు తెలిపారు.
60వ వసంతంలోకి అడుగుపెడుతున్న చారిత్రక ఉత్సవం:
ఉత్సవ కమిటీ చైర్మన్ శీలం మోహనరావు, శెట్టిబలిజ అభ్యుదయ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ.. అంబాజీపేట విజయ భేతాళస్వామి ఉత్సవం ఈ ఏడాదితో 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ తరుణంలో సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు 15 పాలాల కమిటీలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి.చినబాబు, ఎస్సైలు షేక్ సుభాని, ఇ.నరసింహమూర్తి, జి.పద్మారావు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.