మోకాళ్లపై కూర్చొని జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరసన -నాగర్‌కర్నూల్‌లో ఆరో రోజుకు చేరిన నిరవధిక సమ్మె..
జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌లోని సమ్మె శిబిరం వద్ద జాతీయ ఆరోగ్య మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏళ్లుగా ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నాయకులు కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయడంతోపాటు 180 రోజుల ప్రసూతి సెలవులు కల్పించాలని,ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డా. బాలకృష్ణ, జనరల్ సెక్రటరీ దామగట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ బాషా, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ డా. జగన్, కల్చరల్ సెక్రటరీ డా. రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ భీముడు, కోశాధికారి ప్రవీణ్ పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్ , నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్