మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన!
మర్రిగూడ, మేజర్ న్యూస్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో గురువారం మర్రిగూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్లిట్జ్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి మర్రిగూడతో పాటు నాంపల్లి, చండూరు మండలాల నుంచి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై దరఖాస్తులు సమర్పించారు. సుమారు 100 మంది అభ్యర్థులు అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వావలంబన సాధించాలంటే తగిన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. యువత సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని, వ్యక్తిగత ఫొటోలు, సమాచారాన్ని అనవసరంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని హితవు పలికారు. మహిళలపై సమాజంలో జరుగుతున్న వివక్ష, మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి వివరించారు. అభ్యర్థులకు త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కన్నెగొని శంకర్ యాదవ్, కంపెనీ ప్రతినిధులు సతీష్, గ్రామపంచాయతీ సిబ్బంది మహేష్, అభి తదితరులు పాల్గొన్నారు.