మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు సహించేది లేదు
వ్యక్తిగత దూషణలకు దిగితే చట్టపరమైన చర్యలు తప్పవు
పదవులు ఉన్నా.. లేకపోయినా ప్రజల మధ్యే ఉంటాం.. 30 ఏళ్లుగా ప్రజాసేవే మా లక్ష్యం
వాట్సాప్‌లో విద్వేషాలు, రెచ్చగొట్టే సందేశాలపై ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఫైర్
సత్తుపల్లి మేజర్ సూర్య న్యూస్:
(కిరణ్ కుమార్ ఆరిక)
మహిళా ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, వాట్సాప్ వేదికగా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న వారిపై సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దిగేవారు ఎవరి పరిధిలో వారు ఉంటే మంచిదని ఘాటుగా హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా విమర్శించే హక్కు ఉందని, అయితే ఆ విమర్శలు హుందాగా, నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. మహిళా ప్రజాప్రతినిధి అనే గౌరవం కూడా లేకుండా వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. విమర్శల పేరుతో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. గత మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నామని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాగమయి దయానంద్ స్పష్టం చేశారు. ఇన్నేళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు స్పందించని కొందరు వ్యక్తులు ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
రాజకీయాల్లో విమర్శలు సహజమని, ప్రజా సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. అయితే అసత్య ఆరోపణలు చేయడం, మహిళా ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని కించపరచడం, సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు వ్యాప్తి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఇలాంటి బెదిరింపులు, వ్యక్తిగత దూషణలకు భయపడి ప్రజాసేవ నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.