మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి - ప్రజా ప్రభుత్వ పాలనలో అపూర్వ సంబరాలు…మంత్రి పొంగులేటి*
సూర్య,ఖమ్మం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం, ఆత్మగౌరవమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆదివారం నేలకొండపల్లి మండలం కోరుట్లగూడెం గ్రామంలో మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి వేడుకలు కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదవారి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లని, పేదవాడి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు, రెండవ విడతలో 2.5 లక్షల ఇళ్లు, అదనంగా హైదరాబాదులో మరో లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షల ఇళ్లను 40 వేల కోట్ల రూపాయలతో నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు.
మొదటి విడత ఇచ్చిన ఇళ్లలో ఇప్పటికే సుమారు 2 లక్షల 21 వేల ఇళ్లు పైచిలుకు గృహ ప్రవేశాలు జరగగా, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రెండవ విడత ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను ఫైనల్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందేలా మూడో, నాలుగో విడతల్లో సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, పేదవాళ్లకు ఇళ్లతో పాటు వారు కట్టిన ఇంటి నిర్మాణ స్థాయిని బట్టి ప్రతి సోమవారం నాడు వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పూర్తయిన 2 లక్షల 21 వేల ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులతో ఈరోజు మొట్టమొదటి దీపావళి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి అనే కాన్సెప్ట్‌తో డివిజన్ వారీగా, వార్డుల వారీగా, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు కలిసి ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి అన్నారు.
పేదవారి మొఖంలో ఆనందము, సంతోషము, ధైర్యము చూడాలన్నదే ఈ ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పేదవాళ్లకు సాయం చేసే విషయంలో ఈ ప్రభుత్వం ఎన్నడూ వెనకడుగు వేయదని మంత్రి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, దీపావళి పండుగ ఉదయం నుంచి జిల్లాలో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రతీ ఇంటికి వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, వారిని చూసి చాలా సంతోషం కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కట్టుకోవాలనేది జీవితాంతం కలని, గతంలో ఎన్నో ఇబ్బందులు పడి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేదలు నేడు ఎంతో గౌరవప్రదంగా ఇళ్లు కట్టుకుని బతుకుతున్నారని తెలిపారు. తమ పిల్లలతో కలిసి ప్రజలు ఎంతో సంతోషంగా దీపావళి జరుపుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
నేలకొండపల్లి మండలంలో మొదటి విడతలో 691 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 621 ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్నాయని తెలిపారు. ప్రజల్లో దీనిపై వేగవంతమైన పురోగతి మరియు పూర్తి భరోసా ఉందని, ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనే నమ్మకంతో ప్రజలు ముందుండి ఇళ్లు కట్టుకుంటున్నారని తెలిపారు. రెండో విడతలో ఈ గ్రామంలో మరో 17 ఇళ్లు కూడా సాంక్షన్ అయ్యాయని, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి చేకూరుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి టి. సునీల్ రెడ్డి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మండల తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో ఎర్రయ్య, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సూర్య ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ