ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో పూరిళ్లకు ప్రాధాన్యం
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా పూరిళ్లలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఇళ్ల మంజూరు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఆధారాలూ లేకుండా పూరిళ్లలో జీవనం సాగిస్తున్న 37,825 కుటుంబాలను అధికారులు గుర్తించగా, వారిలో మొదటి విడతగా ఇప్పటివరకు 19,119 కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేశారు. మిగిలిన కుటుంబాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10,038 కుటుంబాలకు, ఆదిలాబాద్ జిల్లాలో 3,604 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.