దివ్యాంగులకు అండగా మోడీ సర్కార్. *ఎంపీ రఘునందన్ రావు. *దివ్యాంగులకు పరికరాల పంపిణీ
నర్సాపూర్;పేద ప్రజలకు, దివ్యాంగులకు అండగా నరేంద్ర మోడీ సర్కార్ పనిచేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.శనివారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్ లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి హాజరై దివ్యాంగులకు పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన కాస్కో క్రీడా పోటీల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు 49 పతకాలు సాధించి దేశాన్ని నాలుగో స్థానంలో నిలిపారని గుర్తు చేశారు. దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. దివ్యాంగులను గుర్తించేందుకు ప్రాజెక్టు పరిధిలో కాకుండా మండల స్థాయిలోనే క్యాంపులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హులైన దివ్యాంగులు ఎవరైనా మిగిలిపోతే ఆధార్ కార్డు, సర్టిఫికెట్లు తనకు అందజేస్తే పరికరాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దివ్యాంగులకు విద్య, వైద్య రంగాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. దివ్యాంగులకు ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాచునూరి లక్ష్మీరాజు యాదవ్, వైస్ చైర్మన్ వనముల బుచ్చేష్ యాదవ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ సీడీపీఓ హేమా భార్గవి కౌన్సిలర్లు బుల్లెట్ రాజు నిరంజన్ దాస్ నాయకులు సంఘసాన్ని సురేష్ రమేష్ గౌడ్, రాములు నాయక్ ప్రేమ్ కుమార్ షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.