telangana
దక్షిణాసియా పారా త్రోబాల్ పోటీలకు రవిష్ రెడ్డి. :భారతదేశం తరఫున శ్రీలంకలో ప్రాతినిధ్యం
సూర్య,రాయికల్ ;;రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన కోమటిరెడ్డి రవిష్ రెడ్డి అనే క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.శ్రీలంకలోని ప్రసిద్ధ రత్నాల నగరం రత్నపుర జం సిటీ వేదికగా నవంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించనున్న 2వ సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ పోటీల్లో ఆయన భారత జట్టు తరఫున పాల్గొననున్నారు.శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడారంగంలో తన ప్రతిభను చాటుకుంటూ అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం విశేషం.ఒకప్పుడు ప్రమాదం కారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ,ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు.ఎదురైన కష్టాలను అధిగమిస్తూ క్రీడారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని,నేడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు.ఒకవైపు వ్యాయామ ఉపాధ్యాయుడిగా విద్యార్థులను రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు సన్నద్ధం చేస్తూ,మరోవైపు స్వయంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధమవుతున్నారు.భూపతిపూర్ గ్రామం నుంచి అంతర్జాతీయ క్రీడా వేదిక వరకు ఆయన సాగిస్తున్న ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు రవిష్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ పోటీల్లో విజయం సాధించి,దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.