బియ్యం అక్రమ నిల్వలు చేస్తే చర్యలు
*-అధిక ధరలకు విక్రయిస్తే ఉపేక్షించం:డీసీఎస్ఓ రోజారాణి*
*-భువనగిరి గంజ్‌లో పౌరసరఫరాల అధికారుల తనిఖీలు*
*యాదాద్రి భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*
బియ్యం అక్రమ నిల్వలు చేసి కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి హెచ్చరించారు. శుక్రవారం భువనగిరి గంజ్ మార్కెట్‌లోని హోల్‌సేల్, రిటైల్ వ్యాపార కేంద్రాలను సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.రాహుల్ రైస్ కిరాణం, కల్కి కిరాణం, సహస్ర ట్రేడర్స్, ఓం ట్రేడర్స్‌తో పాటు పలు దుకాణాల్లో బియ్యం రకాలు, నిల్వలు, ధరలను పరిశీలించారు. వినియోగదారులకు నిరంతరాయంగా బియ్యం సరఫరా చేయాలని, తగినంత నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని వ్యాపారులకు సూచించారు. న్యాయమైన ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు.ప్రతి వ్యాపార కేంద్రంలో బియ్యం రకం, నిల్వల పరిమాణం, కిలో ధర వివరాలతో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొనుగోళ్లు, విక్రయాలు, నిల్వలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.