భూములు పోయాయి... ఉపాధి కరువైంది!, ఓసి ప్రభావిత యువతకు ఉద్యోగాలు కల్పించాలి, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి
గణపురం, మేజర్ న్యూస్, ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్, నగరంపల్లి సర్పంచ్ కొడారి హైమావతి–ధనంజయ యాదవ్ డిమాండ్ చేశారు. గణపురం మండలంలోని ఓసీ ప్రభావిత గ్రామాల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కకపోవడంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయ భూములపై ఆధారపడి జీవించిన కుటుంబాలకు భూములే ప్రధాన జీవనాధారంగా ఉండేవని, ఓపెన్‌కాస్ట్ గని కోసం భూములు కోల్పోయిన తర్వాత వారి జీవన పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశ ఉన్నప్పటికీ, అర్హులైన స్థానిక యువతకు తగిన అవకాశాలు దక్కడం లేదని అన్నారు. ఇతర ప్రాంతాల వారికి పనులు కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, స్థానిక యువత మాత్రం ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.ఉపాధి లేక కొందరు యువత పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండగా, మరికొందరు కుటుంబ పోషణ కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని, యువత భవిష్యత్తుపై ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. సింగరేణి అధికారులు ఓసీ ప్రభావిత గ్రామాల యువతకు అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సర్పంచులు కోరారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని, ఈ సమస్యపై అధికారులు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉడుత సాంబయ్య యాదవ్, కొడారి హైమావతి–ధనంజయ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ : ఎల్లయ్య, గణపురం ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా