ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంతో 11వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని సమ్మె శిబిరాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం పరిధిలో కాంటింజెంట్ వర్కర్ల నుంచి స్టాఫ్ నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, వైద్యుల వరకు వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని తెలిపారు.. నిరవధిక సమ్మె కారణంగా ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, వారికి తనవంతు సహాయంగా ఒకరోజు భోజన ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. అవసరమైతే సోమవారం మరోసారి సంబంధిత మంత్రిని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ తదితర జేఏసీ నాయకులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధాన డిమాండ్లను ఎమ్మెల్యేకు వివరించారు.
పి.వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్