బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి: జైనూర్ ఎస్‌ఐ
సూర్య జైనూర్: బాణసంచా విక్రయించే వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జైనూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గోదారి రవికుమార్ సూచించారు. లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణసంచా దుకాణాల యజమానులు, వ్యాపారులు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందాలని తెలిపారు. బాణసంచా నిల్వ, విక్రయాల విషయంలో Explosives Act మరియు Explosives Rules, 2008 నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం నిషేధించిన బాణసంచా, అనుమతి లేని క్రాకర్స్, నాణ్యతా ప్రమాణాలు లేని మరియు లేబుల్స్ లేని బాణసంచాను విక్రయించకూడదని స్పష్టం చేశారు.
బాణసంచా దుకాణాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దుకాణాల వద్ద ధూమపానం, బహిరంగ మంటలు వంటి ప్రమాదకర కార్యకలాపాలకు అనుమతించకూడదన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అనుమతించిన ప్రదేశాల్లోనే దుకాణాలు నిర్వహించాలని, నిర్ణీత పరిమితులకు మించి బాణసంచా నిల్వ చేయరాదని పేర్కొన్నారు.
అదేవిధంగా సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా మతాలు, కులాలు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా రెచ్చగొట్టే పోస్టులు, సందేశాలు, వీడియోలను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా, అనుమానాస్పద సమాచారం అందిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావం, మత సామరస్యంతో పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్‌ఐ గోదారి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు జైనూర్ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణం కాపాడేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.