హాథీరాం భావాజీ మఠం పరిరక్షణకు ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి
హాథీరాం భావాజీ మఠం పరిరక్షణకు ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి
సుగాలీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన బంజారా సేవాదళ్ రాష్ట్ర కమిటీ
కందుకూరు : తిరుమల తిరుపతిలోని చారిత్రక శ్రీ హాథీరాం భావాజీ మఠాన్ని పరిరక్షించడంతో పాటు, మఠానికి సంబంధించిన భూములు, ఆస్తులను కాపాడాలని బంజారా సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామ్ రాథోడ్ నేతృత్వంలోని రాష్ట్ర కమిటీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయిద్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మఠం నిర్వహణ పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని, బంజారా పూజారులతో నిత్య ధూప, దీప, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. 2007 జూలై 11న ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్ 33059 ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే రాష్ట్రంలోని సుగాలీ తండాలు, గూడాలను రెవెన్యూ గ్రామాలు, గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. బంజారా సమాజ మాతృభాష గోర్ బోలికి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు.
చట్టసభల్లో సుగాలీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, అమరావతిలో 20 ఎకరాల స్థలం కేటాయించి సుగాలీ భవన్, బంజారా మ్యూజియం, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిరం, మేరామా యాడీ మందిరాల నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించాలని కోరారు.
బంజారా సమాజ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణతో పాటు సుగాలీల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు గవర్నర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో బంజారా సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అజయ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాథోడ్, గౌరవ అధ్యక్షుడు రాంచందర్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ రాథోడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.