ఆల్వాల్ పరిధిలో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు: కాలనీల మండపాల్లో బీఆర్ఎస్ సీనియర్ నేత అనిల్ కిషోర్ గౌడ్ ప్రత్యేక పూజలు!
సూర్య సిటీ డెస్క్, ఆల్వాల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆల్వాల్ పరిధిలోని వివిధ కాలనీలలో భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన దుర్గామాత మండపాలు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా కాలనీలలో నెలకొల్పిన అమ్మవారి మండపాలను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వెంకట్రావు పేట, సాయి బృందావన్ కాలనీ, సాయి కాలనీ, ఇందిరా నగర్‌లలో ఏర్పాటు చేసిన దేవీ మండపాలకు విచ్చేసిన ఆయన.. జగన్మాతకు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి తీర్థప్రసాదాలు, అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, కాలనీలన్నీ సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా అనిల్ కిషోర్ గౌడ్ ప్రార్థించారు. భక్తిప్రపత్తులతో ఉత్సవాలను నిర్వహిస్తున్న స్థానిక యువతను, ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం పలు మండపాల నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్, విజయ శేఖర్, జె.డి. నర్సింగ్, అమూల్, రామానుజన్ తదితరులతో పాటు కాలనీ ప్రముఖులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.