29వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం
మంత్రి పొంగులేటి సహకారంతో వరంగల్ క్రాస్ రోడ్డులో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభం
*ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో 29వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వరంగల్ క్రాస్ రోడ్డులో కౌన్సిలర్ వెంపటి ఉమా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ :
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. 29వ వార్డు వరంగల్ క్రాస్ రోడ్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో స్థానిక ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రహదారుల సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా ఈ పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంపటి ఉమా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 29వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి సహకరించిన రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకత్వంలో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే స్థానికులకు రాకపోకలు సులభతరమవడంతో పాటు రహదారుల సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోము వెంకటేశ్వరరెడ్డి, బానోత్ ప్రసాద్, మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు వెంపటి సురేష్, బీసీ సెల్ అధ్యక్షులు వెంపటి రవి, 29, 31, 32 వార్డుల అధ్యక్షులు గణపారపు వీరన్న, రామిశెట్టి రమేష్, మిర్యాల నరుణ్ తేజ్, యువజన కాంగ్రెస్ నాయకులు రెబ్బగుండ్ల గోపి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేష్ రెడ్డి, బొడ్డు హర్షవర్ధన్, ఏపూరి తరుణ్ తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.