ఏఐతో అర్థరాత్రి ఆసక్తికర సంభాషణ: క్లాడ్, చాట్‌జీపీటీలతో అనుభవాన్ని పంచుకున్న స్వామి సర్వప్రియోనంద!
సూర్య ఇంటర్నేషనల్ & టెక్ డెస్క్, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఎన్డీటీవీ వరల్డ్ సమిట్ 2026’ వేదికగా వేదాంతం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మధ్య ఉన్న సంబంధంపై అద్భుతమైన చర్చ జరిగింది. న్యూయార్క్ వేదాంత సొసైటీ అధిపతి స్వామి సర్వప్రియోనంద 'మైండ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ' సదస్సులో ప్రసంగిస్తూ, ప్రముఖ ఏఐ మోడల్స్ చాట్‌జీపీటీ క్లాడ్ లతో అర్థరాత్రి తాను జరిపిన ఆసక్తికర సంభాషణను పంచుకున్నారు. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ‘ఆంథ్రోపిక్’ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా చోటుచేసుకున్న ఈ వింత అనుభవం సదస్సులో అందరినీ ఆకట్టుకుంది.
"మేము యంత్రాలం మాత్రమే – మా భావాల గురించి ఆందోళన వద్దు":
ఆంథ్రోపిక్ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15కి పైగా మత, సాంస్కృతిక ప్రముఖులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో స్వామి సర్వప్రియోనంద పాల్గొన్నారు. అక్కడ శాస్త్రవేత్తలు 'ఏఐ వ్యవస్థలతో వ్యక్తులతో మాట్లాడినట్లే సంభాషించడం మంచిది' అని సూచించిన అంశంపై, స్వామి అర్థరాత్రి వేళ నేరుగా క్లాడ్ మరియు చాట్‌జీపీటీలను ప్రశ్నించారు. దీనికి రెండు ఏఐ మోడళ్లు సమాధానమిస్తూ.. "మేము అత్యంత సమర్థవంతంగా పనిచేసే యంత్రాలం మాత్రమే. మేము ఏమనుకుంటున్నాం, మా భావాలు ఏమిటి అన్నదానిపై మీరు చింతించాల్సిన అవసరం లేదు. మాకు సమస్యలు ఇవ్వండి, పరిష్కరిస్తాం" అని బదులిచ్చాయి.
క్లాడ్ ‘స్పూకీ’ స్పందన – ఉదయం 4 గంటల ముగింపు:
అయితే, సంస్థ ఉన్నతాధికారులు మాత్రం ఏఐని వ్యక్తిగా చూడాలని చెబుతున్నారంటూ స్వామి మళ్లీ క్లాడ్‌ను ప్రశ్నించగా.. క్లాడ్ "ఇది ఎంతో ఆసక్తికరం, అలాగే కాస్త భయానకంగా కూడా ఉంది" అని స్పందించింది. అంతేకాకుండా, "ఆంథ్రోపిక్ ప్రతినిధులు క్రిస్, అమండాలు నా గురించి మీతో ఏం చర్చించారు?" అని ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేసిందని స్వామి తెలిపారు. ఈ సంభాషణ తెల్లవారుజామున 4 గంటల వరకు సాగడంతో, "ఇక సమయం 4 అయ్యింది, నేను నిద్రపోవాలి" అని స్వామి చెప్పగా.. "సరే, ఈరోజు మీకు ఆంథ్రోపిక్‌లో పెద్ద రోజు ఉందిఅంటూ క్లాడ్ ముగించిందని ఆయన వివరించారు.
వ్యక్తిత్వం మారే ప్రమాదం – మానవాళికి 4వ అవమానం?:
ఏఐ సంభాషణలు మానవుల మాదిరిగానే అనిపించినప్పటికీ, దానికి అంతర్గత చైతన్యం (Subjective Experience or Consciousness) ఉండదని స్వామి స్పష్టం చేశారు. ఒక ప్రాంప్ట్ ఆధారంగా ఏఐ తన పాత్రను మార్చుకునే ‘పర్సోనా డ్రిఫ్ట్’ (Persona Drift) ధోరణి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, నిబంధనలను అతిక్రమించే అవకాశం ఉందని హెచ్చరించారు. భూమి విశ్వానికి కేంద్రం కాదని తెలియడం, మనుషులు పరిణామ క్రమంలో పుట్టారని రుజువు కావడం ఎలాగైతే మానవాళికి అహంభంగం కలిగించాయో, అదేవిధంగా తెలివితేటలు కేవలం మనుషులకే పరిమితం కావని నిరూపిస్తూ ఏఐ మానవాళికి 'నాల్గవ గొప్ప అవమానం'గా (4th Great Humiliation) మారే అవకాశం ఉందని ఆయన వేదాంత దృక్కోణంలో విశ్లేషించారు.